Sunday, March 15, 2026

గాయపడిన సెక్యూరిటీ గార్డుకు మెరుగైన వైద్యం అందించాలి

  • ఎస్సీకేఎస్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్

నేటి సాక్షి, మందమర్రి:- దొంగల దాడిలో గాయపడిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుకు మెరుగైన వైద్యం అందించి బాధితుడు కొలుకునేవరకు వేతనంతో కూడిన సెలవు ఇప్పించాలని కాంట్రాక్ట్ కార్మికుల సంఘం (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం తెల్లవారు జామున జరిగిన దొంగల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు వేముల స్వామిని ఏరియా ఆసుపత్రిలో పరామర్శించి దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, డివిజన్ పరిధిలోని ఆర్కె1ఎ గని పై రాత్రి డ్యూటీలో ఉండగా తెల్లవారుజామున నలుగురు దొంగలు ముసుగు ధరించి డ్యూటీలో ఉన్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్ పై విచక్షణారహితంగా దాడి చేసి తమకు కావాల్సిన సామానులు ఎత్తుకెళ్లారు. అనుకోకుండా జరిగిన దాడిలో దొంగలు కొట్టిన దెబ్బలకు కింద కుప్పకూలి పడిపోవడం జరిగిందని తెలిపారు. విషయం తెలుసుకున్న జమిందార్ వచ్చి డిస్పెన్సరీకి తరలించి అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం ఏరియా హాస్పిటల్ కు తరలించారని తెలిపారు. సింగరేణి అధికారులు ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు సెప్టీ కల్పించడంలో, సెప్టీ పరికరాలు ఇప్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అంతే కాకుండా ఇద్దరు గార్డులను పంపించాల్సిన ముఖ్యమైన పోస్టుల వద్దకు ఒక్కరినే పంపించి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. దాడికి గురైన కార్మికులను యూనియన్ నాయకులు పరామర్శిస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ భయాందోళనకు గురిచేస్తున్నారని, అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు కక్షసాధింపు చర్యలు చేపట్టడం దుర్మార్గమని అన్నారు. వెంటనే బాదిత కార్మికునికి మెరుగైన వైద్యం అందించి కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News