- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
- అర్హుల ఎంపికకు సర్వే పనులు రేపటి వరకు పూర్తి చేయాలి

నేటి సాక్షి, రామగిరి(కన్నూరి రాజు): ప్రభుత్వం చేపట్టిన 4 పథకాల కార్యక్రమాలకు సంబంధించి అర్హుల జాబితాను శనివారం (ఎల్లుండి) నుంచి గ్రామపంచాయతీలలో/అన్ని మున్సిపాలిటీలలో ప్రదర్శించాలని, గురువారం జిల్లా కలెక్టర్ ముత్తారం, రామగిరి మండలాలలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాలలో వ్యవసాయ యోగ్యం కాని భూములను మాత్రమే రైతు భరోసా జాబితా నుంచి తొలగించాలని, కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. రాళ్లు రప్పలు ఉన్న భూములు, సాగు నీటి ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ చేసిన భూములు, పరిశ్రమల భూములు (రైస్ మిల్ పెట్రోల్ బంక్, ఆహార శుద్ధి పరిశ్రమ), నాలా కన్వర్షన్ జరిగిన భూములు, లేఔట్ ఉన్న భూములు, ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తు భూములు, రొడ్ల భూములు, భవనాలు నిర్మించుకున్న భూముల, మైనింగ్ జరుగుతున్న భూముల వివరాలు రైతు భరోసా నుంచి తొలగించాలని అన్నారు. రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ స్థితిగతులను పరిశీలించి అర్హులకు రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం రామగిరి మండలంలోని బేగంపేటలోని పి.హెచ్.సి. కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. వైద్యులు సమయపాలన పాటించాలని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మండల ఇంచార్జీ డి.సి.ఓ. మాల, వ్యవసాయ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





