- వాటిలో పేర్లు లేవని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- అర్హులైన వారి పేర్లు గ్రామ సభల్లో చేర్చుతాం
- గ్రామ సభల్లో ఆమోదం పొందిన తర్వాతనే తుది జాబితాలు సిద్ధం చేస్తాం
- స్పష్టం చేసిన జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ (రమేష్) గద్వాల :- రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించి అధికారులు ప్రస్తుతం చూపుతున్న జాబితాలు ఫైనల్ కాదని జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ స్పష్టం చేశారు. గ్రామ సభల్లో అవసరమైన పేర్లను వాటిలో చేర్చి గ్రామ సభల ఆమోదం పొందిన తర్వాతనే తుది జాబితాలు తయారౌతాయని చెప్పారు. ఈ లోపుగా అధికారులు తయారు చేసిన జాబితాల్లో తమ పేర్లు లేవని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలలో అనర్హుల పేర్లు, అర్హుల పేర్లు కనిపించడం లేదని పలు ప్రాంతాల నుంచి తన దృష్టికి ఫిర్యాదులు వచ్చాయని సరితమ్మ తెలిపారు. అధికారులు తయారుచేసిన జాబితాలో కొన్నిచోట్ల ఒకే రాజకీయ వర్గానికి చెందిన వారి పేర్లు కూడా ఉన్నాయని తమకు ఫిర్యాదులు అందాయన్నారు. అయితే ప్రస్తుతం అధికారులు తయారుచేసిన ఈ జాబితాలు ఫైనల్ కాదని ఈనెల 21 నుంచి 25 వరకు జరగనున్న గ్రామసభల్లో లబ్ధిదారుల తుది జాబితాలు తయారవుతాయని తెలిపారు. గ్రామ సభలలో అధికారులు తయారుచేసిన జాబితాలను సమీక్షించి వాటిలో నుండి అనర్హుల పేర్లను తొలగించి అర్హులైన వారి పేర్లను జాబితాలో చేర్చడం జరుగుతుందని వివరించారు. ఈ విధంగా గ్రామ సభల్లో సమీక్షించి ఆమోదించిన జాబితాలు మాత్రమే ఫైనల్ అని అందరు గుర్తించాలని సరితమ్మ కోరారు. ఈ లోపుగా అధికారులు తయారు చేసిన జాబితాలలో తమ పేర్లు లేవని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇతర పథకాలు అందేలా అర్హులైన వారందరి పేర్లు జాబితాలలో ఉండేలా చూసే బాధ్యత తనదేనని చెప్పారు. జిల్లా ఇంఛార్జి మంత్రి, పార్లమెంటరీ సభ్యుడితో కలిసి జాబితాలను చూసిన తర్వాతనే వాటిని ఆమోదించడం జరుగుతుందని సరితమ్మ వెల్లడించారు. అయితే అధికారులు ఎవరైనా తాము తయారు చేసిన జాబితా లు ఫైనల్ అనే తప్పుడు సంకేతాలు ఇస్తే అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని అర్హతలు కలిగి ఉన్నా ఎంపిక కాని వారు ఎవరైనా ఉంటే అలాంటి వారు గద్వాల లోని సరితమ్మ క్యాంప్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే అలాంటి వాటిని సరిదిద్దేలా చూస్తామని, నిజమైన అర్హులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సరితమ్మ హామీ ఇచ్చారు.





