- – చెరువును తలపిస్తున్న ప్రధాన రోడ్డు
- – పట్టించుకోని సంబంధిత అధికారులు
నేటి సాక్షి, వేమనపల్లి: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని కొత్తగూడెం నుంచి నీల్వాయి బస్ స్టాండ్ వరకు గల ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచి కుంటను తలపిస్తుంది. వర్షం నీరు ఎక్కువ రోజులు రోడ్డుపైన ఉండడంతో కుంటను తలపించేలా ఉండడంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నూరు నుంచి వేమనపల్లి మండలానికి ప్రధాన రోడ్డు కావడంతో నిత్యం వందల కొలది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం రహదారిపైన రోజుల తరబడి నీరు నిలిచి ప్రజలకు వాహనదారులకు అసౌకర్యం కల్పించడం శోచనీయం.
ఈ రోడ్డు మార్గాన వెళ్లడానికి నరకయాతనంగా ఉందంటూ వాహనదారులు వాపోతున్నారు. ఇదే రోడ్డు గుండా నిత్యం వందల కొలది మంది వాహనాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇదే మార్గంలో ప్రయాణిస్తున్న రోడ్డు నిర్మాణ పనులపై స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనీ అధికారుల తీరుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం మండల కేంద్రానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కూడా ఇదే రహదారి గుండా ప్రయాణించారు. ఇప్పటికైనా ఆర్అండ్బీ అధికారులు స్పందించి ప్రధాన రహదారిపై నీరు నిల్వ ఉండకుండా రహదారి మరమ్మత్తులు చేసి సమస్య పరిష్కరించాలని వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.