- జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా, స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ఎంజీఎం ఆసుపత్రిలో శవ పరీక్షల కేంద్ర నిర్వహణ పటిష్టంగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో శవ పరీక్షల కేంద్ర నిర్వహణపై జరిగిన సమావేశంలో కలెక్టర్ సమీక్షించి సమర్థవంతంగా నిర్వహించుటకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శవాల పోస్టుమార్టం సకాలంలో జరిగి గౌరవంగా పంపేలా ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మెడికల్, ఫోరెన్సిక్, మున్సిపల్, పోలీస్ అధికారులు సమన్వయంతో పోస్టుమార్టం త్వరతంగా నిర్వహించాలన్నారు. మార్చురీకు వెంటనే మంచినీటి పైప్ లైన్ వేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మార్చురీలో సీసీ కెమెరా ఆడియో రికార్డింగ్ తో సహా ఏర్పాటు చేయాలని, తక్షణమే ఆటో మాడ్ లో జనరేటర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ఎంజీఎం సూపరింటెండెంట్ ను ఆదేశించారు. అనాధ శవాలను న్యాయబద్ధంగా 72 గంటల్లో పంచనామా చేసి ఖననం చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తగినంత సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారిని ఆదేశించారు. శవాలను కప్పుటకు అవసరమైన తెల్ల వస్త్రాన్ని, బాక్సులు తదితర సమకూర్చాలని ఆదేశించారు. నిర్వహణ సక్రమంగా జరిగే విధంగా అధికారులు ఆకస్మికంగా మార్చురీను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంజీఎం పర్యవేక్షకులు డాక్టర్ కిషోర్, ఆర్ఎంఓ శ్రీనివాస్, ఫోరెన్సిక్ ప్రొఫెసర్ లక్ష్మణరావు, ఎం హెచ్ ఓ డాక్టర్ రాజేష్, ఎస్ఐ సాంబయ్య, డి ఈ రంగారావు, తహసిల్దార్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.





