- ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవాలి
- 18 ఏళ్లు నిండిన యువ ఓటర్లు ఖచ్చితంగా ఓటరుగా నమోదు చేసుకోవాలి
- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ జిల్లా నేటి సాక్షి, (భూమయ్య) : ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు హక్కు అని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం, ఓటరు అవగాహన కార్యక్రమ ర్యాలీ ని స్థానిక పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా స్టేడియం లో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ముందుగా అందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా ఎన్నికలు చేపట్టామన్నారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి మండలంలో ఓటు హక్కు గురించి ఓటరుకు అవగాహన కల్పించామని వివరించారు.
జిల్లాలోని ప్రతి పాఠశాల, కళాశాలల్లో నిర్వహించే ప్రత్యేక క్యాంపెయిన్ ల ద్వారా, ఎన్నికల కమిషన్ పోర్టల్ ద్వారా, ఓటరు యాప్ ద్వారా, 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా, బూత్ స్థాయి కేంద్రాల ద్వారా కొత్త ఓటరుగా, అలాగే ఎవరికైనా ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే కూడా నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు.
ఈ ఏడాది థీమ్ వచ్చేసి నథింగ్ లైక్ ఓటింగ్.. ఐ ఓట్ ఫర్ సూర్ (Nothing like Voting.. I Vote for Sure)
అనే నినాదంతో ప్రజాస్వామ్యంలో ఓటుకు మించి ఏదీ లేదు.. ఖచ్చితంగా నేను ఓటు వేస్తాను అనే ఉద్దేశమని పేర్కొన్నారు. భారతదేశం.. విభిన్న సంస్కృతి, సంప్రదాయాలతో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందన్నారు. ఇంతటి ఘనత గల భారతదేశంలో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలన్నారు. రాబోయే పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో అర్హులైన ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా యువత, వివిధ వర్గాలకు చెందిన వారు ఎక్కువగా పాల్గొనాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది శక్తిమంతమైన ఆయుధమని, ఓటును అమ్ముకోకుండా బాధ్యతగా ఓటును వేయాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, ప్రజలు, విద్యార్థులు, తదితరులు ఓటరు ప్రతిజ్ఞ చేశారు. సీనియర్ సిటిజన్స్ ను పూలమాలలు వేసి శాలువతో సత్కరించారు.బూత్ స్థాయి సిబ్బందికి మొమెంటో లతో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. వ్యాసరచన, వక్తృత్వ రంగోలి పోటీలలో విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రము, షీల్డ్ బహుమతులు అందించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తమ సేవలందించిన సిబ్బందినీ ప్రశంసా పత్రం తో సత్కరించారు. ఓటరు దినోత్సవం నేపథ్యంలో సాంస్కృతిక సారథి కళాకారులు ఓటు హక్కుపై పాడిన పాటలు ఎంతగానో స్ఫూర్తిని నింపాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, అడిషనల్ ఎస్పీ మహేందర్ డిఆర్ఓ, భుజంగరావు, ఆర్డీవో రమాదేవి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎలక్షన్ విభాగం డిప్యూటీ తాహసిల్దార్ నవీన్, యువజన క్రీడల నిర్వహణ అధికారి నాగరాజు, తాహసిల్దార్ లక్ష్మణ్ బాబు, సీనియర్ సిటిజన్స్ , వివిధ ప్రభుత్వ పాఠశాల, కళాశాలల విద్యార్థిని విద్యార్థులు,వయోవృద్ధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.





