

నేటి సాక్షి, కొడిమ్యాల, జనవరి 27 : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్ గ్రామంలో ఆదివారం పెద్దపులి సంచారం మళ్ళీ కలకలం రేపుతోంది. ఈనెల 23న గుండు బాబు అనే రైతుకు చెందిన ఆవుపై దాడి చేసి కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే అప్పటినుండి అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పులి కోసం గాలిస్తున్నారు. 24న సిసి ఫుటేజ్ విడుదల చేసి పెద్దపులి సంచరిస్తుందని నిర్ధారించారు. ఆ రోజు కనిపించిన పెద్దపులి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటివరకు మళ్ళీ కనిపించలేదు. పులి కనిపించడం లేదని అంత ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో అదే కోమటిగుట్ట ప్రాంతంలో కల్లు గండిలోని దండవేని తిరుపతి మామిడి తోటలో మూడు కుక్కలను చంపి తిని గ్రామ సమీపంలోని గుట్ట ప్రాంతంలో పొలాల వద్ద గ్రామానికి చెందిన రైతుకు పులి అడుగులు మళ్లీ కనిపించడంతో భయభ్రాంతులకు లోనై గ్రామానికి చేరుకొని అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వెళ్లి అడుగులు పరిశీలించి పులి అడుగులేనని నిర్ధారించడంతో ఒక్కసారిగా గ్రామస్తులు కంగుతిన్నారు. దీంతో అటవీశాఖ అధికారులు మళ్లీ పులిని వెతకడం ప్రారంభించారు.





