Sunday, March 15, 2026

నా పోరాటం వల్లే రెండో విడత దళిత బంధు

  • దళితుల అభివృద్ధి హక్కుల కోసం పోరాటం…
  • హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
నా పోరాటం వల్లే హుజురాబాద్ లో రెండో విడత దళిత బందును ప్రభుత్వం విడుదల చేసిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దళితుల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని, స్వయం ఉపాధిని ప్రోత్సహించాలని, వారి జీవితాల్లో ఆర్థిక స్వావలంబన తీసుకురావాలని భావించి, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేశారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను సాకారం చేయడమే లక్ష్యంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 10 లక్షల సహాయాన్ని ప్రతి దళిత కుటుంబానికి అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే దళితుల ఆర్థిక అభ్యున్నతికి మొట్టమొదటి ప్రాజెక్ట్‌గా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధును పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారన్నారు. దాదాపు 18 వేల దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారన్నారు. ఇది బీఆర్‌ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దళిత బంధును నిలిపివేసిందన్నారు. ఎన్నికల సమయంలో రూ.12 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదని మండిపడ్డారు. హుజురాబాద్‌లో రెండో విడతగా మంజూరు చేసిన దళిత బంధు నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీజ్ చేసి, లబ్ధిదారులకు అందకుండా అడ్డుకుందన్నారు. దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అతిపెద్ద ద్రోహమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఎమ్మెల్యేగా దళిత బంధు అమలుపై ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చానన్నారు. దళిత బంధు అమలుపై అసెంబ్లీలో, జిల్లా పరిషత్ సమావేశాల్ కలెక్టరేట్ సమావేశాల్లో అధికారులను నిలదీశానని తెలిపారు. దళితుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న తనను అణచివేయాలని ప్రభుత్వం కుట్రపన్నిందన్నారు. తనపై కేసులు పెట్టి, కాంగ్రెస్ నాయకుల చేత దాడులు చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిన దళితుల అభివృద్ధి కోసం వెనక్కి తగ్గకుండా పోరాటాన్ని చేస్తున్నానన్నారు. నియోజకవర్గంలో దళితుల అభివృద్ధి వారి హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తానన్నారు. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నదే బీఆర్‌ఎస్ లక్ష్యం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని, లేదంటే, దళిత ద్రోహి పార్టీగా చరిత్రలో మిగిలిపోతుందని హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News