- జిల్లా కలెక్టర్
- డా. వెంకటేశ్వర్ ఎస్
నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) తిరుపతి : సఫాయి కరంచారీల సేవలు అమూల్యమైనవనీ, వెల కట్టలేనివనీ, వారిని గౌరవ ప్రదంగా చూడాలని, వారికి సంబంధించిన పథకాలు వారికి సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం మద్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా మాన్యువల్ స్కావెంజర్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తో కలిసి నిర్వహించారు. సఫాయి కరంచారీలకు నాణ్యమైన యూనిఫాం అందిస్తున్నామని, సఫాయి కరంచారీల సేవలు అమూల్యమైనవని, వెల కట్టలేనివని, వారిని గౌరవప్రదంగా చూడాలనీ, వారికి సంబంధించిన పథకాలు వారికి సక్రమంగా సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. గ్రీన్ అంబాసిడర్ లకు పేమెంట్స్ చెల్లించడం జరిగిందని తెలిపారు. ఎల్డిఎం సమన్వయంతో వారికి రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని, అందుకొరకు త్వరలో సమావేశం ఏర్పాటు చేయమని అధికారులకు సూచించారు. వారి పిల్లలకు స్కాలర్షిప్స్ ఇచ్చే అంశంపై అలాగే ప్రైవేట్ హాస్టల్లో మాన్యువల్ స్కావెంజర్ లకు కనీస వేతనాలు అందించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గతంలో నేషనల్ సఫారీ కరంచారి కమిషన్ చైర్మన్, జాతీయ సఫాయి కరంచారి సభ్యులు జిల్లాను సందర్శించి సమీక్ష నిర్వహించారని తెలిపారు. తిరుపతి పట్టణం నందు మాన్ హోల్ శుభ్రపరిచే క్రమంలో చనిపోయిన కార్మికులకు నష్టపరిహారం అందించడం జరిగిందని తెలిపారు. జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు వివరిస్తూ.. థియేటర్లలో, రైల్వేలలో మున్సిపల్ పరిధిలో సఫాయి కరంచారి పనులు చేపట్టే వారికి సరియైన యూనిఫామ్, మహిళలు దుస్తులు మార్చుకునే ఏర్పాటు అంశాలపై సదుపాయాలు కల్పించాలని, వాటిపై దృష్టి సారించాలని కోరారు. మున్సిపల్ పరిధిలో గ్లోవ్స్, షూ యూనిఫామ్ తదితర అంశాలు కార్మికులకు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పథకాలైన ఎన్ఎస్కేఎఫ్డిసి సబ్సిడీ లోన్లను అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ నరసింహులు, ఆర్డీవోలు తిరుపతి, కాళహస్తి మరియు సూళ్ళూరుపేట రామ్మోహన్, భాను ప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, డి పి ఓ శ్రీమతి సుశీల దేవి, డి ఆర్ డి ఏ పిడి శోభన్ బాబు, డ్వామా పిడి శ్రీనివాసప్రసాద్, జిల్లా వైద్య శాఖాధికారి బాలకృష్ణ నాయక్, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు తదితర అధికారులు పాల్గొన్నారు.




