- – మృతులది ఒకే కుటుంబం
- – అనంతరపురం జిల్లా రుద్రంపల్లిలో ఘటన
- – కల్యాణదుర్గం ఎమ్మెల్యే ప్రగాఢ సానుభూతి
- – అంత్యక్రియలకు రూ.50 వేలు అందజేత
నేటి సాక్షి ప్రతినిధి, కల్యాణదుర్గం: అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఎనుములదొడ్డి పంచాయతీ పరిధి రుద్రంపల్లిలో బుధవారం తెల్లవారుజామున మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. కురుబ గంగన్న(43), ఆయన భార్య శ్రీదేవి(38), కూతురు సంధ్య (14) (9వ తరగతి విద్యార్థి) ప్రమాదంలో మరణించారు. కొన్ని రోజులుగా వానలు పడుతుండటంతో వీరి ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నది. పైగా వర్షపు నీళ్లు మిద్దెపై నిలిచింది. ఈ క్రమంలో బుధవారం మిద్దె కూలిపోయింది. వీరి మరణం టీడీపీకి తీరని లోటని ఎమ్మెల్యే వ్యక్తంచేశారు. ప్రస్తుతం శబరిమల యాత్రలో ఉన్న కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వెంటనే స్పందించి, ఫోన్ ద్వారా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చనిపోయిన వారి అంత్యక్రియలకు తక్షణమే ఎమ్మెల్యే వ్యక్తిగతంగా రూ.50 వేలు టీడీపీ నాయకుల ద్వారా అందజేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా ఆదుకొంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అందుబాటులో లేనందున త్వరలోనే గ్రామానికి వచ్చి వారి కుటుంబ సభ్యులను కలుస్తానని ఆయన తెలియజేశారు.