Wednesday, March 18, 2026

త‌న‌పై దాడిని లోక్‌స‌భ‌లో ప్ర‌స్తావించిన‌ తిరుప‌తి ఎంపీ

  • స్వ‌తంత్ర ద‌ర్యాప్తు చేయాల‌ని గురుమూర్తి డిమాండ్

నేటి సాక్షి, తిరుపతి న్యూస్ తిరుపతి ప్రతినిధి (డాక్టర్ శివ) :
తిరుప‌తి డిప్యూటీ మేయ‌ర్ ఉప ఎన్నిక సంద‌ర్భంలో ఓటింగ్‌కు వెళ్లే సంద‌ర్భంలో తిరుప‌తి ఎస్వీ యూనివ‌ర్సిటీలో త‌న‌తో పాటు మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌, ఎమ్మెల్సీ సిపాయి సుబ్ర‌మ‌ణ్యంతో పాటు వైసీపీకి చెందిన కార్పొరేట‌ర్ల‌పై భౌతిక‌దాడుల‌కు పాల్ప‌డిన‌ట్టు తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి తెలిపారు. లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ స‌మావేశాల్లో భాగంగా ప్రత్యేక ప్రస్తావన 377 కింద ఆయ‌న మాట్లాడుతూ హింస గురించి ప్ర‌స్తావించడం గ‌మ‌నార్హం. డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎమ్మెల్సీ, నగర మేయర్, కార్పొరేటర్లతో కలిసి తాను ప్రయాణిస్తున్న వాహనంపై దాడి జరిగిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇధి ప్రజాస్వామ్య విరుద్దమైన సంఘటన అని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కార‌న్నారు. తమపై దాడి అప్ర‌జాస్వామ్యం అని ఆయ‌న సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ దాడి సమయంలో తమ వాహనంలో మహిళా కార్పొరేటర్లు కూడా ఉన్నారని, వారు తీవ్ర భయాందోళనలకి లోనయ్యారని తెలిపారు. తాము ప్రయాణిస్తున్న వాహనంపై దాడి జరిగే సమయంలో పోలీసులు ఉన్నా, ర‌క్షించాల్సింది పోయి, ప్రేక్షక పాత్ర పోషిస్తూ, చోద్యం చూస్తూ నిలబడ్డారని ఎంపీ ఆరోపించారు. ఈ సంఘటనపై ఇప్పటి వరకు జిల్లా పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోలేదని స‌భ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా ప్రతినిధుల భద్రతను నిర్లక్ష్యం చేస్తూ, నేరస్తుల‌కు అండగా వ్యవహరించడం పూర్తిగా అన్యాయమని తిరుపతి ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులపై ఇలా హింసాత్మక దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం అన్నారు. తక్షణమే ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఊహించుకోవాల‌న్నా తీవ్ర ఆవేద‌న క‌లుగుతోంద‌న్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News