నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి);
పట్టణాలలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో మార్చి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీ పని తీరు పై సంబంధిత అధికారులతో నిర్వహించిన రివ్యూ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణాలలో రోడ్ల పై చెత్త లేకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. పట్టణంలోని ముఖ్యమైన ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, రోడ్లపై చెత్త ప్లాస్టిక్ ఉండకుండా చూడాలని అన్నారు. మంథని, సుల్తానాబాద్ పట్టణాలలో టి.యూ.ఎఫ్.ఐ.డి.సి క్రింద మంజూరైన రోడ్లు, డ్రైయిన్, ఇతర అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో మార్చి నాటికి పూర్తి చేయాలని, రోడ్డు విస్తరణ మొదలగు అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న విద్యుత్ పోల్స్ ను విద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తొలగించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పట్టణాలలో ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ పూర్తి స్థాయిలో వసూలు చేయాలని, మున్సిపాలిటీలలో పని చేసే సిబ్బందికి జీతాల చెల్లింపు లేట్ కాకుండా చూడాలని అన్నారు. ఎల్.ఆర్.ఎస్ పెండింగ్ దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని అన్నారు. సుల్తానాబాద్ లోని డివైడర్ లలో మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. సుల్తానాబాద్ పట్టణానికి డంప్ యార్డ్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని తహసిల్దార్ తో ఎంపిక చేయాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో సుల్తానాబాద్ ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.