Thursday, March 26, 2026

పశు వైద్యం… దైవాధీనం!

  • పశువులకు సకాలంలో అందని వైద్య సేవలు
  • చాలా చోట్ల గోపాల మిత్రులే దిక్కు
  • ఆందోళనలో రైతులు

నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్) : సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో పశువైద్యం ‌ పడకేసింది. పశు వైద్యం పై నిర్లక్ష్యం కొనసాగుతుంది. మూగ జీవాలే కదా..! బతికినా.. చచ్చినా.. ప్రశ్నించే వారెవరు అన్న తీరులో వైద్య సేవలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో పశువైద్యశాలలు పరిస్థితి దయనీయంగా మారింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మూగజీవాలకు సరైన వైద్యం అందకుండా పోతుంది. ఇక గ్రామీణ ప్రాంతాలలో రోగాల బారినపడిన పశువులకు అటెండర్లు, గోపాల మిత్రులే వైద్యమే దిక్కవుతుంది. కొన్ని పశు వైద్యశాలలో డాక్టర్లే లేరు. ఉన్నచోట సమయపాలన పాటించటం లేదు. దీంతో పశు పోషణ పై ఆధారపడిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జీవాలకు జబ్బు చేస్తే నయం చేసేందుకు డాక్టర్లు కరువయ్యారు. ఉన్నచోట డాక్టర్లు సెలవు పై ఉన్నారని అటెండర్లు చెబుతున్నారు. రోజువారి రిజిస్టర్ల పై సంతకాలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయి. కొన్నిచోట్ల వారానికి ఒకటి లేదా రెండు రోజులు ఆసుపత్రికి వచ్చి హాజరు పట్టికలో సంతకం పెట్టి ఒంటిగంటకే తిరుగు ముఖం పడుతున్నారు. గ్రామాలలోని పశు వైద్యులు విధుల్లో ఉండాలి. కానీ తాము ఎలా పనిచేసినా ఎవరు పట్టించుకోరని ధీమాతో కొంతమంది వైద్యులు ఆసుపత్రి లోని కాంపౌండర్ల మీద బాధ్యతలు వదిలేసి ఏంచెక్క కార్లపై చక్కర్లు కొడుతుంటారు. మరికొందరైతే ప్రైవేట్ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో పశువైద్యశాలలు సక్రమంగా తెరుచుకోవడం లేదని తెలిసినా ఉన్నంత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు గా ఉండిపోవడంతో పశు వైద్యులు ఆడిందే ఆటగా సాగుతుంది. గ్రామాలలో పశువులతో పాటు కుక్కలను పెంపకం చేస్తుంటారు. రోగం వస్తే సాధారణ మందులు కూడా ఆసుపత్రుల్లో ఉండటం లేదు. తెల్ల కాగితం పై రాసి దగ్గర్లో ఉన్న వెటర్నరీ దుకాణం యజమాన్యానికి విపరీ చేస్తారు. ఇకనైనా అధికారులు స్పందిస్తే గ్రామీణ ప్రాంత పశువులను కాపాడు కోగలుగుతాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News