
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి యాసంగి పంటలకు సాగునీటి సరఫరా గురుకులాల్లో రెగ్యులర్ గా తనిఖీలు, ప్లాస్టిక్ ఫ్రీ, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వరంగల్ జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ.. రాబోయే 10 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని, యాసంగి పంటల సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని సిఎస్ సూచించారు. ఎత్తి పోతల పథకాలకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రిజర్వాయర్ల నుంచి విడుదల చేసిన ప్రతి నీటి చుక్కను సమర్థవంతంగా వినియోగించాలని అన్నారు. గురుకులా ల్లో రెగ్యులర్ గా తనిఖీలు చేస్తూ పిల్లలకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని అన్నారు. అనంతరం సంబంధిత జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, పంటలను సంరక్షించే లా అధికారులు పటిష్ట చర్యలు తీసుకొని రాబోయే 10 రోజుల పాటు అప్రమత్తంగా ఉంటూ నీటి సరఫరా పర్యవేక్షించాలని, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా లోటు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, హార్టికల్చర్ అధికారి సంగీత లక్ష్మి నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




