- ముఖ్య అతిథిగా హాజరై కళాకారులతో కలిసి త్యాగరాజ కీర్తనను ఆలపించిన కలెక్టర్ ప్రావిణ్య

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హనుమకొండ బాల సముద్రంలోని కాళోజి కళాక్షేత్రం ఆడిటోరియం లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని సంగీత, నృత్య కార్యక్రమాల్ని నిర్వహించారు. త్యాగరాజ ఆరాధన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ముఖ్య అతిథిగా పాల్గొని హైదరాబాద్ నుండి వచ్చిన కళాకారులతో పాటు స్థానిక కళాకారులు, కళాశాల అధ్యాపక బృందంతో కలిసి త్యాగరాజ కీర్తనను ఆలపించారు. అదే విధంగా హైదరాబాద్ కు చెందిన పలువురు కళాకారులతో పాటు స్థానిక కళాకారులు పలు త్యాగరాజ కీర్తనలు ఆలపించగా కలెక్టర్ తిలకించారు.
స్థానిక కళాకారులతో పాటు హైదరాబాద్ కు చెందిన కళాకారులు త్యాగరాజ కీర్తనలను ఆలపించి సంగీత అభిమానులను అలరింప జేశారు. విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొన్న కళాకారులందరికీ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అభినందనలు తెలియజేశారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, కళాకారులందరికీ స్వర్ణోత్సవ శుభాకాంక్షలను కలెక్టర్ తెలియజేశారు. విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ నాడ్గౌడ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలలో కళాశాల అధ్యాపకులు భాస్కర్, అనుముల యోష , హైదరాబాద్ లోని తెలుగు విశ్వ విద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓని విజయ్, తదితరులతో పాటు కళాకారులు, సంగీత అభిమానులు పాల్గొన్నారు.





