- ఇందిరమ్మ రాజ్యంలో పోలీస్ పహారా నడుమ గ్రామసభలు
- అధికారులను నిలదీస్తున్న ప్రజలు


నేటి సాక్షి, మునగాల(పాముల రాఘవేందర్) : మునగాల మండల పరిధిలో గల గ్రామాలు రేపాల, సీతా నాగారం, మాదారం, కృష్ణానగర్, ముకుందాపురం, నరసింహపురం లో నిర్వహించిన గ్రామసభలు అధికారులకు తలనొప్పులుగా మారాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో లబ్ధిదారుల జాబితాలో అర్హుల పేర్లు గల్లంతయ్యాయంటూ పలు గ్రామాలలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో గ్రామ సభలలో జరుగుతున్న గందరగోల పరిస్థితుల పై బిఆర్ఎస్, బిజెపి ,సిపిఎం పార్టీ నాయకులు ప్రజల పక్షాన స్పందిస్తూ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పల్లి ఆదిరెడ్డి, సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి గండు వీరయ్య, కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమ పంగు జానయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది ప్రజా పాలన కాదని. ముమ్మాటికి ప్రజావ్యతిరేక పాలన అని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందక గ్రామసభలలో ప్రజలు ఎంత అగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీరు ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా మీ ప్రభుత్వం పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేట తెల్లవాయింది. పల్లె పల్లెలలో ఎక్కడికక్కడ నిలదీస్తున్న ప్రజానీకాన్ని చూస్తే మీ ఏడాది పాలన పెద్ద దగా కోరు అని అర్థమవుతుందని అన్నారు. మీ ఇందిరమ్మ రాజ్యంలో పోలీస్ పహారా నడుమ గ్రామసభలు నిర్వహించాల్సిన దుస్థితి రావడం దారుణం అన్నారు. పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఒక వైపు గ్రామసభలు నిర్వహిస్తుంటే. మరోవైపు కార్యకర్తలకే పథకాలు ఇస్తామని అధికార పార్టీ నాయకులు చెప్పటం సిగ్గుచేటన్నారు. అలాంటప్పుడు గ్రామసభలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నట్లైనా అని ప్రశ్నించారు. అర్హులైన వారికి పథకాలు ఎగగోడుతున్నట్లేనా అని అడిగారు. ఎన్నికల ముందు హామీలు ఇస్తాం, అధికారంలోకి వచ్చాక ఎగగోడతాం అన్నట్టుగా వ్యవహరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అర్హులైన వారందరికీ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక షరతులతో కూడిన పథకాలు లబ్ధిదారులకు ఎలా అందుతాయని అన్నారు. లబ్ధిదారులకు పథకాలు అందకుంటే ప్రజలు తిరగబడకుండా ఏం చేస్తారని తెలిపారు. గ్రామ సభలలో కాంగ్రెస్ నాయకుల పాపం అధికారులకు శాపంగా మారిందని సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలు దగా.. 6 గ్యారంటీలు అమలు దగా, రుణమాఫీ చేయడం దగా, పంట బోనస్ ఇవ్వడం దగా, రైతు బోనస్ అమలు దగా, రేషన్ కార్డులు జారీ చేయడం దగా, ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక దగా, ఏడాది కాలంలో మీరు చేసిన దగాను ప్రజలు అర్థం చేసుకున్నారు. మీరు చేసిన మోసాన్ని నయా వంచనాను తెలుసుకున్నారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తారు అని తెలిపారు. అర్హులైన పేద ప్రజలకు పథకాలు ఇవ్వకపోతే ప్రజలు ఉప్పెనగ ఉద్యమించక ముందే కండ్లు తెరవాలని సూచించారు. ఎన్నికల హామీలు చెప్పినట్లుగా అర్హులందరికీ ప్రభుత్వం పథకాలను అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.





