- సింగరేణి అధికారులకు ఎమ్మెల్యే వివేక్ సూచన
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:– జిల్లాలోని జైపూర్ మండలం రామారావు పేట గ్రామం నుంచి గోదావరి ఒడ్డున గల పొలాలకు వెళ్లే రోడ్డు మార్గం విషయమై గ్రామస్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి సంబంధిత సింగరేణి అధికారులకు సూచించారు. గురువారం ఆయన గ్రామస్తులను కలిసి గ్రామం నుంచి గోదావరి ఒడ్డున గల పొలాలకు వెళ్లే రోడ్డు మార్గాన్ని సింగరేణి ఇందారం ఓసిపి డంప్ యార్డ్ కోసం మూసివేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గతంలోని గోదావరి రోడ్డునే కొనసాగించాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. ఈ విషయపై ఆయన సింగరేణి అధికారులతో చర్చించారు. గ్రామస్తులకు నష్టం కలగకుండా సింగరేణి అధికారులు వేరే చోటు నుండి రోడ్డు వేసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే చొరవతో సమస్య సద్దుమనగడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత ప్రభుత్వ, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.





