- చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం.
- సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు.
- భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు.

నేటిసాక్షి, వీణవంక :
ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్ పరిధిలో ఉన్నటువంటి హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల రైతులకు సాగునీరు అందిస్తామని, దానికి సంబంధించి ఎస్కేప్ గేట్ కింద కల్వల ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు నీరందించి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. ఆదివారం రోజున మొలంగూర్ క్రాస్ వద్ద ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కెనాల్ లో గల ఎస్కేప్ గేట్ ను రైతులతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మల్లన్నపల్లి, బ్రాహ్మణపల్లి, వీణవంక, రెడ్డిపల్లి, రామకృష్ణాపూర్, నర్సింగాపూర్, లస్మక్కపల్లి, పోతిరెడ్డి పల్లి, జమ్మికుంట మండలంలోని గోవిందాపూర్, విలాసాగర్ గ్రామాల రైతులకు సాగునీరు అందిస్తామని, అధైర్యపడవద్దని తెలిపారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా పథకాన్ని,ఆలాగే గుంట భూమిలేని నిరుపేద వ్యవసాయ రైతు కుటుంబాలకు ఇందిరమ్మ అత్మీయ భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారని ఇది రైతులకు శుభవార్త అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

