నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : నిరుపేద ఆడబిడ్డను ఆదుకునేందుకు పలువురి మానవతామూర్తుల హృదయాలు స్పందిస్తున్నాయి. ఎన్టిపిసి అన్నపూర్ణ కాలనీ చెందిన కరుణ అనే నిరుపేద యువతికి ఇటీవల ఓ యువకుడితో పెళ్లి కుదిరింది. పెళ్లి చేసే స్తోమతలేని ఆ నిరుపేద కుటుంబం ఆర్థిక పరిస్థితిని చూసి చలించిపోయిన ఆ పెళ్ళికొడుకు, కట్నం తీసుకోకుండా యువతిని పెళ్లి చేసుకోవడానికి స్వచ్ఛందంగా అంగీకరించాడు. కానీ, పుట్టింటి నుంచి ఆడబిడ్డకు తోచినంత పెళ్లి కానుకలు పెట్టి, పదిమందికి పెళ్లి భోజనం పెట్టీ ఘనంగా సాగనంపాలని తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. కానీ ఇవన్నీ చేయడానికి చేతిలో చెల్లింగవ్వలేక మానసికంగా కుమిలిపోతున్న తల్లిదండ్రుల దినస్థితిని, శ్రీ సీతారామ సేవాసమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ తెలుసుకొని స్పందించారు. స్వచ్ఛంద సంఘాలు, దాతల సహకారంతో కరుణకు ఘనంగా పెళ్లి చేసి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం నింపాలని చంద్రకళ ఆకాంక్షించారు. దాతలు సందించాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా చంద్రకళ ఇచ్చిన పిలుపుమేరకు పలు స్వచ్ఛంద సంఘాలతో పాటు దాతలు పెళ్లికూతురుకు చేయూతనిచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నెల 12న బుధవారం కరుణ పెళ్లి జరగనుంది. దాతలు ఇప్పటికే మాజీ కార్పొరేటర్ అయిత శివకుమార్-పుష్ప దంపతులు 10,000 రూపాయలు పెళ్లి ఖర్చు కింద అందజేయాగా, శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు గోలివాడ చంద్రకళ, కంది సుజాత, సరిత, లక్ష్మి, బొగెలత, కొండు రమాదేవి, సింగరేణి సంస్థ ఉద్యోగి క్రాంతి కుమార్, ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆకుల రాం కిషన్, కరీంనగర్ విజయలక్ష్మి ఫ్రెండ్స్ కిట్టి పార్టీ సభ్యులు, అభయ చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ వెల్ది కవిత అనంతరాములు, ఫైట్ ఫర్ బెటర్ సొసైటి తదితర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల ఆధ్వర్యంలో మట్టెలు, మంగళ సూత్రాలు, పెళ్లి బట్టలు, ఇతర విలువైన ఫర్నిచర్ సామాగ్రిని అందించారు. ఇదే తరహాలో మంగళవారం కూడా క్వింటాల్ బియ్యం, నూనె, పప్పు దినుసులు తదితర పెళ్లికి అవసరమైన సామాగ్రిని పెళ్లి కూతురు తల్లిదండ్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గోలివాడ చంద్రకళ, అయిత శివకుమార్ పుష్ప, మద్దెల దినేష్, లేనిన్, రమెష్, గౌస్, కంది సుజాత, కొండు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి స్పందించి తోచిన రీతిలో సహాయం చేసిన దాతలకు చంద్రకళ కృతఙ్ఞతలు తెలిపారు.



