Thursday, March 26, 2026

యాసంగి పంట సాగుకు నీటిని చివరి ఆయకట్టు వరకు అందించాలి

  • రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- రాష్ట్రంలో యాసంగి పంట సాగుకు నీటిని చివరి ఆయకట్టు వరకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్ శాఖల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సాగునీటి శాఖ అధికారులు, వ్యవసాయ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, వ్యవసాయ బోరుబావుల క్రింద సాగు అయ్యే యాసంగి పంటలకు సాగునీటిని చివరి ఆయకట్టు వరకు అందించేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సీజన్ లో ఒక ఎకరం కూడా ఎండిపోకూడదని, వచ్చే 10 రోజులు చాలా కీలకమైన సమయమని అన్నారు. ప్రాజెక్టుల నుండి చెరువులను నింపాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా పర్యవేక్షించాలని, సాగు నీటిని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని, వృధా చేయకూడదని తెలిపారు. తహసిల్దార్, నీటిపారుదల శాఖ ఎఈ, మండల వ్యవసాయ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, త్రాగునీరు, సాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. జిల్లాలో గల ప్రతి గురుకులాన్ని సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న నూతన మెనూ అమలుపై తనిఖీలు నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలని, ప్లాస్టిక్ వాడకం కలిగే నష్టాలను ప్రజలందరికీ తెలిసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. జిల్లాలోని సాగు అయ్యే యాసంగి పంటల కొరకు ఎత్తిపోతల పథకం, ప్రాజెక్టులు, చెరువులు, బోరుబావుల ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలను జిల్లా అధికారులు ప్రతి రోజు సందర్శించి నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు విద్యార్థులకు అమలు చేస్తున్న మెనూను పరిశీలించి, వసతి గృహాలలో రాత్రి బస చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయంతో సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించడం జరుగుతుందని తెలిపారు. టాస్క్ఫోర్స్, ఫుడ్ సెక్యూరిటీ శాఖ అధికారులు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి భోజనం, వంట తయారీకి వినియోగించే బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలను పరిశీలించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల శాఖల అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News