- నేర శాతం తగ్గింపుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలి
- ఇసుక అక్రమ రవాణపై కఠినంగా వ్యవహరించాలి
- జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : న్యాయం వైపు పనిచేస్తూ బాధితులకు అండగా నిలిచి న్యాయం చేయడం ద్వారా ప్రజలలో పోలీసుశాఖ పట్ల మరింత నమ్మకం, పెంపొందించేలా పనిచేయాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపిఎస్ అన్నారు. గురువారం రోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లాలోని డిఎస్పీలు, సీఐలు, అన్ని పోలీస్టేషన్ల ఎస్సైలతో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ నెలవారి నేరసమీక్ష సమావేశం నిర్వహించి పెండింగ్ కేసుల గురించి తెలుసుకొని క్షేత్రస్థాయిలో వారికి ఎదురవుతున్న సమస్యలను కూలంకషంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి పలు సూచనలు చేయాలి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డిఎస్పీ, సీఐలు తప్పకుండా తమ పరిధిలో ఉన్న స్టేషన్లను సందర్శించి, వారి పనితీరు సమీక్షించాలని , తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుని వాటి ప్రకారం నేర నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. పోలీస్టేషన్ పరిధిలో ఇరవై నాలుగు గంటల పెట్రోలింగ్ గస్తీ ఉండాలని అన్నారు. రోజువారీ పెట్రోలింగ్ ను మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని, వీలైనంత తక్కువ సమయంలో బాధితుల వద్దకు చేరుకోవాలని సూచించారు. నేరస్తులను పట్టు కోవటంలో, నేరపరిశోధనలో, సాంకేతిక ఆధారాలను మరియు సీసీటీవీ కెమెరాలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను వెంటాడి పట్టుకోవాలని, పాత నేరస్తుల కదలికల మీద నిఘా వేసి ఉంచాలని, వారు మళ్ళీ నేరాలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు తమ విధి నిర్వహణలో పారదర్శకంగా, నిజాయితీగా,జవాబుదారీతనంతో ఉండాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి ప్రజలతో మమేకమై పని చేయాలని, విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఫుట్ పెట్రోలింగ్ ను మరింత ముమ్మరంగా చేయాలని సూచించారు. నూతన నేర న్యాయ చట్టాల గురించి అధికారులు, సిబ్బంది సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలని, చట్టపరిధిలోనే పని చేయాలని, దర్యాప్తు నిబంధనలకు అనుగుణంగా నేర పరిశోధన జరగాలని, గరిష్ట శిక్షా రేటు సాధించేలా కృషి చేయాలని సూచించారు.మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, షీ టీమ్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. గంజాయి సరఫరా మరియు వినియోగం మీద ఉక్కుపాదం మోపాలని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకో వాలని, ప్రజలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు అధికారులందరూ సమర్థవంతంగా పనిచేయాలని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే అట్టి వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలియజేసారు. ఈ నేర సమీక్షా సమావేశంలో వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరావు, కొత్తకోట సిఐ, రాంబాబు, ఆత్మకూర్ సిఐ, శివకుమార్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, నరేష్, డిసిఆర్బి ఎస్సై, తిరుపతిరెడ్డి , జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





