- – కోరుట్లలో మందుబాబుల వీరంగం
- – కానిస్టేబుల్, హోమ్ గార్డ్ పై దాడి
- – దవాఖానలో చికిత్స పొందుతున్న హోంగార్డు
- – పట్టణంలో అర్ధరాత్రి కలకలం
నేటి సాక్షి, కోరుట్ల (రాధారపు నర్సయ్య): మద్యం మత్తులో మందుబాబుల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. అర్ధరాత్రి వరకు పీకలదాకా తాగుతూ అడ్డొచ్చిన వారిపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే కొందరు మందుబాబులు అర్ధరాత్రి దాటిన తర్వాత, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేయడంతో అర్ధరాత్రి కోరుట్లలో కలకలం సృష్టించింది.
పోలీసులపై దాడి.. మందుబాబుల పరారీ
కోరుట్ల పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి మద్యం మత్తులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులపై దాడి చేసిన ఘటన కలకలాన్ని రేపింది. తాళ్లచెరువు ప్రాంతంలో మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారని 100 నంబర్‌కు ఫిర్యాదు అందింది. వెంటనే ‘బ్లూకోల్ట్’ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ గంగాధర్, హోమ్ గార్డ్ జహీర్ హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, మత్తులో ఉన్నవారు యూనిఫాంలో ఉన్న వారినే ఉద్దేశించి ‘మీరు పోలీసులైతే ఏంట్రా? భయపడాలా? గతంలో ‘మీ బ్లూకోల్ట్’ పోలీసులకు ఎన్నిసార్లు ఇవ్వలేదురా? దొబ్బేయండి ఈడినుంచి’.. అని సామూహికంగా విరుచుకుపడ్డారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన హోమ్ గార్డ్ జహీర్‌పై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

గాయపడ్డ పోలీసులకు ఆసుపత్రిలో చికిత్స
గాయపడిన పోలీసు హోంగార్డు జహీర్‌ను సహచర పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యుల ప్రకారం వారి ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని వెల్లడించారు.
పోలీసులు గాలింపు చర్యలు
ఈ ఘటనపై ఎస్సై చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన మత్తులో ఉన్న వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలో అర్ధరాత్రి వరకు విధి నిర్వహిస్తున్న పోలీసులపై దాడి జరగడం తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.. ‘ప్రజల రక్షకులపైనే దాడి చేస్తే.. ఇక సామాన్యులకు రక్షణ ఏదీ.? అంటూ పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






