- సుల్తానాబాద్ జూనియర్ కాలేజ్ అభివృద్ధికి కృషి
- ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

నేటి సాక్షి ,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి) : సుల్తానాబాద్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు 45 రోజులపాటు ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తన సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కాలేజీలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేందుకు తన వంతు సహకారం కృషి ఉంటుందని అన్నారు. వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంగా గ్రామీణ ప్రాంతం నుంచి ఉదయం పూట కాలేజీకి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కష్టంగా మారిందని అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారని, ఇందుకు తాను ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టానని వివరించారు. ఈ కాలేజీ పూర్వ విద్యార్థిగా తాను ఈ స్థాయికి ఎదగడం ఎంతో సంతోషంగా ఉందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం తన బాధ్యతగా భావిస్తున్నట్టు విజయరమణ రావు తెలిపారు. ప్రభుత్వమే ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు. సుల్తానాబాద్ కాలేజ్ అభివృద్ధిలో భాగంగా హై స్కూల్ విభాగం కు నూతన భవనాన్ని నిర్మించనున్నట్టు చెప్పారు. ఎంసెట్, నీట్ పరీక్షలకు సన్నద్ధం అయ్యే స్టూడెంట్స్ కు అవసరమైన పుస్తకాలను అందిస్తానని చెప్పారు. కాలేజీ విద్యార్థులు చదువులతో పాటు క్రీడలు ఇతర అన్ని రంగాల్లో రాణించడం గర్వంగా ఉందన్నారు. పట్టుదలతో లక్ష్యాన్ని సాధించేందుకు స్టూడెంట్స్ కష్టపడి చదవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన, మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, ఏఎంసి చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణ, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్, ప్రిన్సిపాల్, లెక్చరర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.





