నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- బీసీ రాజ్యాధికార సాధనలో మహిళలు ముఖ్య భూమిక పోషించాలని, బీసీ ఉద్యమంలో మహిళ మేధావులు పాల్గొని, బీసీ రాజ్యాధికార సాధనలో భాగస్వాములు కావాలని బీసీ సమాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుతోట పద్మాదేవి పిలుపునిచ్చారు. బీసీ సమాజ్ మహిళా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే స్ఫూర్తితోనే మహిళ సాధికారత సాధిద్దామని పిలుపునిచ్చారు. సావిత్రిబాయి పూలే గొప్ప సంఘ సంస్కర్త అని, దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయిని, రచయిత్రి అని, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన జ్యోతిరావు పూలే భార్య అని, కుల మతా భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి అని కొనియాడారు. ఆధునిక విద్య తోనే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్త మహాత్మా జ్యోతిరావు పూలే తో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించిందన్నారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యకి వ్యతిరేకంగా, శూద్రుల అతిశత్రుల మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు భావించారని తెలిపారు. నూతన వ్యవస్థ కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి, సమిష్టిగా పోరాటం చేసిందన్నారు. ఆధునిక భారత దేశంలో ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన తొలితరం మహిళ ఉద్యమకారిణి, సావిత్రిబాయి పూలే అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ మహిళా విభాగం సీనియర్ నాయకురాలు ఈనవంక నాగలక్ష్మి, బూర్ల జ్యోతి, పొడేటి సంగీత, శ్రీరామోజు సాంబలక్ష్మి, రాపాక సారిక, కుమ్మరి రజిని, బొంపల్లి సునీత, సముద్రాల కవిత, చొప్పరి కవిత, శ్రీదేవి, రోడ్డ స్వర్ణలత లు పాల్గొన్నారు.



