- టవర్ క్లాక్ నుంచి విద్యుత్తు కార్యాలయం వరకు ర్యాలీ
- జెండాలు చేతబట్టుకుని భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు

నేటి సాక్షి ప్రతినిధి (తిరుపతి జిల్లా) :
ఎన్నికలకు ముందు విద్యుత్తు చార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు నాయకుడు అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే కరెంటు చార్జీలను విపరీతం గా పెంచేసి ప్రజలను మోసం చేశారని చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం చంద్రగిరి నియోజకవర్గంలో కరెంటు చార్జీల పెంపుపై పోరుబాటను నిర్వహించారు. చంద్రగిరి టవర్ క్లాక్ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి మోహిత్ రెడ్డి వెంట నడిచారు. జెండాలు చేతబట్టుకుని ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగలు రాజ్యం.. దోపిడి రాజ్యం.. పెంచిన కరెంటు చార్జీలు వెంటనే.. తగ్గించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్మోహర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ జెండాలు చేతబట్టుకుని పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు కదిలారు. ప్రజలను నిలువునా మోసం చేశారు. ఎన్నికలకు ముందు కరెంటు చార్జీలను పెంచమని చెప్పిన కూటమి పార్టీల నేతలు అధికారంలోకి వచ్చిన వెంటనే విపరీతంగా కరెంటు చార్జీలు పెంచి పేద ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీడియాకు వివరించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని మాట చెప్పి ఇప్పటి వరకు ఆ మాట ఎత్తకుండా ప్రజలను మోసం చేశారని, ట్రూ అప్ చార్జీల పేరిట కరెంటు చార్జీలు విపరీతంగా పెంచడం వల్ల ప్రజల జేబులు గుల్లవుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చెప్పిన హామీలు అన్నీ అమలు చేయాలని, అంతకంటే ముందు పెంచిన విద్యుత్తు చార్జీలను తక్షణం తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీలు తగ్గించేంత వరకు పోరాటం చేస్తామని, జగనన్న నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా వున్నామని వెల్లడించారు. అనంతరం విద్యుత్తు శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ అధికారి వారికి వినతి పత్రం అందించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రజలకు మేలు చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో పేరు పేరునా వారందరినీ మోహిత్ రెడ్డి పలుకరించి ఆత్మీయతను చాటుకున్నారు.

