నేటి సాక్షి, మునగాలవిద్యనే విజయానికి మొదటి మెట్టుగా తీసుకుని ముందుకు సాగితేనే భవిష్యత్ బంగారంగా మారుతుందని కెఆర్ఆర్ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్, సాయి గాయత్రి విద్యాలయ చైర్మన్ ఆరవపల్లి శంకర్ పేర్కొన్నారు. మునగాల మండల కేంద్రంలోని సాయి గాయత్రి విద్యాలయంలో నిర్వహించిన 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించడం గురువుల బాధ్యత మాత్రమే కాకుండా తల్లిదండ్రుల సహకారం కూడా ఎంతో అవసరమని అన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేస్తేనే విద్యార్థుల మానసిక అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు.ప్రస్తుత కాలంలో టెక్నాలజీ విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో విద్యార్థులు దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్మార్ట్ఫోన్లకు పరిమితం కాకుండా, పుస్తక పఠనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. నృత్యాలు, పాటలు, నాటికలతో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ సభలో ఉత్సాహాన్ని నింపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





