* నేటి సాక్షి, బాపట్ల జిల్లా (బాపట్ల టౌన్)బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా, అక్టోబర్ 28 ఉదయం నాటికి ‘మొంథా’ అనే పేరుతో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం కాకినాడ మధ్య మొంథా తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉందని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు తెలిపారు.ఈ నెల 27 నుండి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న మొంథా తుఫాను ప్రభావం వల్ల ఈ నెల 27, 28, 29 తేదీలలో జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎలాంటి ప్రాణ , ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, విద్యుత్, త్రాగునీరు, పారిశుధ్యం సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఏ విపత్తునైనా ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు అవసరం లేకుండా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు విజ్ఞప్తి చేశారు. బాపట్ల నియోజకవర్గం పరిధిలోని బీచ్ లను తాత్కాలికంగా మూసివేస్తున్నామని, యాత్రికులకు/భక్తులకు ప్రవేశం లేదని కార్తీక మాసం పురస్కరించుకొని కార్తిక సోమవారాలు పుణ్య స్థానాలు ఆచరించాలని ఉద్దేశంతో సముద్ర తీరాలకు రాదలిచిన భక్తులు ఈ విషయాన్ని గమనించి రావద్దని ఎమ్మెల్యే తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లడం తాత్కాలికంగా నిషేధించడం జరిగిందన్నారు. ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దని, ఎవరైనా వెళ్ళి ఉంటే వారు కూడా వెంటనే తీరానికి తిరిగి వచ్చేయాలని ఎమ్మెల్యే తెలిపారు.మోంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. తుపాన్ ప్రభావం ఉండే అవకాశమున్న తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని, వైద్య సిబ్బంది తుపాన్ సమయంలో ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆరోగ్య శాఖకు ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రతి ఒక్కరు అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే తెలిపారు.





