నేటి సాక్షి తిరుపతి * (బాదూరు బాల) తిరుపతి జిల్లా పుత్తూరు అటవీ ప్రాంతం లోని నారాయణవనం వద్ద 19ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారి కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ శ్రీనివాస్ అధ్వర్యంలో డీఎస్పీ ఎండీ షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన ఎఆర్ఎస్ఐ ఎన్.ఈశ్వర్ రెడ్డి టీమ్ ఆదివారం కైలాసకోన నుంచి కూంబింగ్ చేపట్టింది. వీరు పుత్తూరు అటవీ పరిధిలోని నారాయణవనం సమీపంలోని సింగారకోన రోడ్డు కన్నికలమ్మ ఆలయం సమీపం వద్దకు చేరుకోగా, అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపించారు. టాస్క్ ఫోర్సు పోలీసులను చూసిన వారు పారిపోవడానికి ప్రయత్నించగా, వెంబడించి చుట్టుముట్టారు. ఆ పరిసర ప్రాంతాల్లో పరిశీలించగా, 19ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని, పట్టుబడిన వ్యక్తులను అరెస్టు చేశారు. వారిని స్థానికులుగా గుర్తించారు. వారిని, దుంగలతో పాటు తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి, ఎసీఎఫ్ శ్రీనివాస్ లు విచారించగా, ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.





