Monday, March 16, 2026

రీజనల్ రింగ్ రోడ్ భూ సేకరణకు రైతులు సహకరించాలి: జిల్లా కలెక్టర్ కె. హైమావతి

నేటి సాక్షి గజ్వేల్ : —-రీజనల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణంలో భూమిని కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. భూ సేకరణకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన నియమావళి ప్రకారం రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందజేస్తామని ఆమె హామీ ఇచ్చారు.సోమవారం గజ్వేల్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయం సమావేశ మందిరంలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కారణంగా భూములు కోల్పోతున్న జగదేవ్‌పూర్ మండలం చెబర్తి, అల్రాజీపేట, పిర్లపల్లి, ఇటుక్యాల గ్రామాల రైతులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సేకరణలో భాగంగా చేపట్టే ఆర్బిట్రేషన్ ప్రక్రియ గురించి రైతులకు వివరిస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం గుండా రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం జరగడం వల్ల ఈ ప్రాంతానికి అభివృద్ధి అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు. రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పారు.ప్రజల అవసరాల కోసం తమ భూములను త్యాగం చేస్తున్న రైతుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. భూమి కోల్పోతున్న ప్రతి రైతుకు ప్రభుత్వం నిర్ణయించిన విధానాల ప్రకారం సరైన నష్టపరిహారం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూ సేకరణ ప్రక్రియలో ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.అలాగే భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తవ్వాలంటే రైతులు సహకరించాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలకు అందరూ తోడ్పడితే ప్రాంతం త్వరగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.ఈ సమావేశంలో ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ నిర్మలతో పాటు సంబంధిత శాఖల అధికారులు మరియు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News