నేటి సాక్షి, మునగాలమునగాల మండలంలో రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వాహనదారులకు కీలక సూచనలు జారీ చేశారు. “హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ప్రమాదం తప్పదు… అలాంటప్పుడు యముడే మీ దోస్త్ అవుతాడు” అంటూ ఆయన ఘాటుగా హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇది చట్టపరమైన బాధ్యత మాత్రమే కాకుండా ప్రాణ రక్షణకు అత్యవసరమని తెలిపారు.ఇటీవల ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానాలు విధించడమే కాకుండా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని ఎస్ఐ వివరించారు. యువత ముఖ్యంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడపకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.అతివేగం, మొబైల్ ఫోన్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొంటూ, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా మాత్రమే ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి, రహదారి భద్రతను మెరుగుపరచడంలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, వాహనదారులు పోలీసుల సూచనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.





