- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
- అసెంబ్లీలో పర్యాటక శాఖ మంత్రికి పలు సూచనలు..
- మిడ్ మానేరు – బోటింగ్, నాంపల్లి గుట్ట, రోప్ వే ఏర్పాటు..
- పర్యాటక కేంద్రాలుగా పలు దేవాలయాలు..

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల ( కోక్కుల వంశీ ) : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పర్యాటక అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అసెంబ్లీలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి పలు అభివృద్ధి సూచనలు తీసుకెళ్లారు.
- మిడ్ మానేరు – బోటింగ్..

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు జలాశయాన్ని పూర్తిస్థాయిలో బోటింగ్ మరియు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. జిల్లాలోని ప్రధాన ప్రదేశాల్లో ఒకటైన మిడ్ మానేరు,అనేక మంది పర్యాటకులను ఆకర్షించేలా మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
- నాంపల్లి గుట్ట, రోప్ వే..

ప్రముఖ పవిత్ర స్థలమైన నాంపల్లి గుట్టపై రోప్ వే ఏర్పాటు చేసి, ఈ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. రోప్ వే ఏర్పాటుతో భక్తులకు సులభంగా దర్శన భాగ్యం కలిగే అవకాశం ఉండటంతో పాటు, పర్యాటక అభివృద్ధికి బలమైన ప్రోత్సాహం లభించనుంది.
- హరిత హోటల్ ఆధునికీకరణ..

పెండింగ్‌లో ఉన్న హరిత హోటళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రత్యేకంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థాన స్థలంలో నడుస్తున్న హరిత హోటల్‌ను ఆధునికీకరించి మెరుగైన వసతులు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
- అనుబంధ దేవాలయాల అభివృద్ధి..
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాలను మరింత అందంగా అభివృద్ధి చేయడంతో పాటు అనుబంధ దేవాలయాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని కోరారు. ముఖ్యంగా,మామిడిపల్లి శ్రీ సీతారామ స్వామి దేవస్థానం,సనుగుల శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయం, రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం,పోతారం లోని శ్రీ లొంకరామేశ్వర స్వామి ఆలయం, నాగారం శ్రీ సీతారామ ఆలయం, మన్నెగూడెం,భీమారంతో పాటు వేములవాడ నియోజకవర్గ పరిధిలోని ఇతర గుట్టలపై వెలసిన దేవాలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పర్యాటక అభివృద్ధి ద్వారా ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మరియు భక్తులకు మరింత మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రతిపాదనలన్నీ త్వరలో అమలులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పర్యాటక శాఖ మంత్రికి ప్రభుత్వ విప్ విజ్ఞప్తి చేశారు..





