నేటి సాక్షి మహబూబాబా ద్ (బి. రవినాయక్) జనవరి 29మరిపెడ మండలం ఇటుకల గడ్డ తండాలో అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న ఇద్దరు చిన్నారుల మృతి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ ఇప్పటి వరకు సంబంధిత శాఖల నుంచి ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలు లంబాడీల ఐక్య వేదికను ఆశ్రయించాయి.ఈ వినతులకు స్పందించిన లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర కార్యాలయం, రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త జాదవ్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో జనవరి 31న (శనివారం) ఇటుకల గడ్డ తండా, గిరిపురం గ్రామం, మరిపెడ మండలం, డోర్నకల్ నియోజకవర్గానికి జాతి నిజ నిర్ధారణ కమిటీను పంపనుంది.ఈ సందర్భంగా లంబాడీల ఐక్య వేదిక మరిపెడ మండల అధ్యక్షులు దేవేందర్ నాయక్ గూగులోత్ మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు వేదిక పూర్తిగా అండగా ఉంటుందని, నిజ నిర్ధారణ కమిటీతో కలిసి తండాను సందర్శించి వాస్తవాలు వెలికి తీస్తామని తెలిపారు.నవంబర్ 29న చిన్నారి చైత్ర భూక్య, డిసెంబర్ 18న చిన్నారి నిత్య శ్రీ భూక్య మృతి చెందడం జరిగిందని, దాదాపు 60 రోజులు గడుస్తున్నా వారి మరణాలకు గల కారణాలు ఇప్పటికీ తెలియరాకపోవడం ఆందోళన కలిగించే విషయం అని దేవేందర్ నాయక్ గుర్తు చేశారు.ఈ నెల 31న మరిపెడ మండల కేంద్రంలోని లంబాడీల ఐక్య వేదిక నియోజక కార్యాలయం నుంచి రాష్ట్ర కమిటీతో కలిసి తండాకు వెళ్లనున్న నేపథ్యంలో, మండలంలోని లంబాడీల ఐక్య వేదిక నాయకులు, జాతి నాయకులు, కుల సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపాలని ఆయన పిలుపునిచ్చారు.రాష్ట్ర నిజ నిర్ధారణ కమిటీ నిత్య శ్రీ భూక్య, చైత్ర భూక్య కుటుంబాలను కలిసి, జరిగిన సంఘటనలపై పూర్తి సమాచారం సేకరించి, చిన్నారుల మృతికి గల అసలు కారణాలను వెలుగులోకి తీసుకురావాలని లక్ష్యంగా ఈ పర్యటన చేపట్టినట్లు లంబాడీల ఐక్య వేదిక నాయకులు తెలిపారు.





