నేటి సాక్షి, ధర్మారం (జనవరి 31) : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన జాతీయ క్రీడా శిక్షకులు మేకల సంజీవరావు నేతృత్వంలో యువత తమ లక్ష్యాలను సాధిస్తూ, దేశ ప్రజా శ్రేయస్సు కోసం సేవా దృక్పథంతో, సామాజిక బాధ్యత కలిగి ముందుకు సాగాలనే ఆశయంతో “పీపుల్స్ యువసేన యూత్” (రిజి. నెం. 892/2025) అసోసియేషన్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలను తన పాటలతో, మాటలతో ఎల్లప్పుడూ చైతన్యపరుస్తూ, ప్రజా ఉద్యమాలకు ప్రతినిధిగా నిలుస్తున్న అరుణోదయ ఆణిముత్యం, ప్రజా గాయకురాలు విమలక్క చేతుల మీదుగా శనివారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లి ఆవరణలో పీపుల్స్ యువసేన యూత్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను ఘనంగా ఆవిష్కరించారు.అదేవిధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపాల్, తెలుగు ప్రొఫెసర్ ఖాసీం చేతుల మీదుగా పీపుల్స్ యువసేన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించారు.ఈ సందర్భంగా సంజీవరావు మాట్లాడుతూ.. ఈ యువసేన ద్వారా సభ్యులు తమకు తోచిన జ్ఞానాన్ని సేవా నిరతితో వినియోగిస్తూ, రానున్న కాలంలో ధర్మారం మండల ప్రజలకు, యువతకు వివిధ ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.





