నేటి సాక్షి – రాయికల్ ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ వేధింపులకు నిరసనగా రాయికల్ మండల మరియు పట్టణ శాఖ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలలోని రామాజీపేట , ఇటిక్యాల, కట్కాపూర్, చింతలూరు, మూటపెల్లి, కొత్తపేట, సింగారావుపేట్ మిగతా అన్ని గ్రామాలలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రాయికల్ మండల అధ్యక్షులు బర్కం మల్లేష్ గారు మాట్లాడుతూ…కేసీఆర్ ని సిట్ విచారణకు పిలవడం అనేది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్య అని తీవ్రంగా ఖండించారు.తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన కేసీఆర్ ప్రజాదరణను తట్టుకోలేకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిరంకుశ, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందన్నారు.ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు, నోటీసులతో భయబ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు.ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరంతరం పోరాటం చేస్తాయని హెచ్చరించారు.కేసీఆర్ పై జరుగుతున్న రాజకీయ వేధింపులను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరని, తగిన సమయంలో కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు..ఈ నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో మండల గ్రామాల అధ్యక్షులు మరియు పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.





