Sunday, March 8, 2026

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం: ఆరవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నవ్య శ్రీ

నేటి సాక్షి గజ్వేల్…గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవ్య శ్రీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.రైతుల అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పేరుతో అనేక సాగునీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారని గుర్తు చేశారు. అలాగే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ‘రోటి, కపడా, మకాన్’ నినాదంతో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం, బ్యాంకుల జాతీయీకరణ వంటి సంస్కరణల ద్వారా పేదల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందన్నారు.ఇందిరాగాంధీ కాలం నుంచి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పేదల సంక్షేమం కోసమే పని చేస్తోందని నవ్య శ్రీ పేర్కొన్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు మార్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. జలయజ్ఞం పథకాన్ని కాలేశ్వరం ప్రాజెక్టుతో ముడిపెట్టి వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణంలో పేదల నుంచి భూములు లాక్కొని అన్యాయం చేశారని, గజ్వేల్ పట్టణ అభివృద్ధి నిధులను పక్క నియోజకవర్గమైన సిద్ధిపేటకు మళ్లించారని ఆమె ఆరోపించారు. మాజీ సీఎం నిర్మించిన మహతి ఆడిటోరియం, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించకుండా పార్టీ కార్యకర్తలకు అవకాశాలు ఇచ్చారని తెలిపారు. పట్టణంలో నిర్మించిన బస్టాండ్ నిరుపయోగంగా మారిందని, కేవలం కమిషన్ల కోసమే భారీ భవనాలు నిర్మించారని అన్నారు.రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ గజ్వేల్ పట్టణంలో అంతర్గత రోడ్ల నిర్మాణం చేయలేకపోయారని, ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరగలేదని ఘాటుగా విమర్శించారు.ఆరవ వార్డు అభివృద్ధికి రాజకీయంగా తొలి అడుగు వేస్తున్నానని, ప్రజాసేవ లక్ష్యంగా పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నవ్య శ్రీ ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెద్దిరెడ్డి అశోక్ రెడ్డి, గాడిపల్లి శ్రీనివాస్, సుఖేందర్ రెడ్డి, జాకీర్ మహమ్మద్, బాబు మియా, హర్షత్, హనుమంత రెడ్డి, మల్లారెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News