నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )జగిత్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న సఖి సెంటర్ ఆవరణలో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై యువతి బంధువులు కత్తులు, రాళ్లతో దాడి చేసిన ఘటన శుక్రవారం కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే…ఎనగందుల అనిల్ కుమార్ (30), తండ్రి రాజేష్, కులం మాదిగకు చెందిన యువకుడు. అతనిపై చర్లబుత్కూరు గ్రామం (కరీంనగర్)కు చెందిన సౌమ్య బంధువులు దాదాపు 15 మంది కలిసి దాడికి పాల్పడ్డారు. రాళ్లతో కొట్టడంతో పాటు కత్తులతో దాడి చేయగా అనిల్ కుమార్ తల, చెయ్యి, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను జగిత్యాల సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.*ఇదీ..నేపథ్యం.!*అనిల్ కుమార్‌కు తొమ్మిదేళ్ల క్రితం మల్యాల మండలం మాడంపెల్లికి చెందిన లావణ్యతో వివాహం జరిగింది. అయితే రెండేళ్ల క్రితం వీరిద్దరూ విడిపోయారు. వీరికి ఒక పాప కూడా ఉంది. సుమారు ఆరు నెలల క్రితం అనిల్ కుమార్‌కు సౌమ్యతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారడంతో వారం రోజుల క్రితం వీరు వివాహం చేసుకుని మల్యాల మండలం లంబాడి పల్లి గ్రామానికి వెళ్లి నివాసం ఉంటున్నారు.ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం అనిల్ కుమార్ మల్యాల పోలీస్ స్టేషన్లో విషయాన్ని తెలియజేయగా, పోలీసులు సౌమ్యను ఐదు రోజులుగా జగిత్యాల పట్టణంలోని సఖి సెంటర్లో ఉంచారు.*తీసుకెళ్లేందుకు రాగానే దాడి*శుక్రవారం సఖి సెంటర్ అధికారులు అనిల్ కుమార్ మరియు అతని తల్లిదండ్రులకు యువతిని వచ్చి తీసుకెళ్లాలని సమాచారం ఇచ్చారు. దీంతో వారు సఖి సెంటర్‌కు చేరుకున్నారు. ఇదే సమయంలో సౌమ్యకు సంబంధించిన బంధువులు అక్కడికి చేరుకుని అనిల్ కుమార్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. పట్టణంలో ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.!______





