నేటి సాక్షి గజ్వేల్…..నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏర్పాటైనప్పటికీ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ఉద్యమకారులకు, సామాన్య ప్రజలకు ఇప్పటికీ తగిన న్యాయం జరగలేదని తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి అన్నారు.సిరిసిల్ల నుంచి జాగృతి రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో యువకులు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆయన పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీ సమీపంలో వేముల ఘాట్ గ్రామస్తులతో కలిసి పాదయాత్రకు మద్దతు ప్రకటించారు. అనంతరం గజ్వేల్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు సాగిన పాదయాత్రలో పాల్గొని యువకులకు ఉత్సాహం నింపారు.ఈ సందర్భంగా కొట్టాల యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ సాధన ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు త్యాగాలు చేశారని గుర్తు చేశారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందాల్సిన ఫలాలు పూర్తిస్థాయిలో అందలేదని విమర్శించారు. ముఖ్యంగా నీటి ప్రాజెక్టులు, ఉద్యోగ నియామకాలు, అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో అమలు కాలేదన్నారు.అలాగే ఉద్యమ సమయంలో ప్రాణత్యాగాలు చేసిన వారి కుటుంబాలకు, ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగ యువతకు ఇప్పటికీ సరైన అవకాశాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటైన తరువాత కూడా నిరుద్యోగ సమస్య తీవ్రమైందని, నియామకాల విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు.ఈ నేపథ్యంలో జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రేపు ప్రకటించనున్న రాజకీయ పార్టీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా ముందుకు సాగుతుందని చెప్పారు. ఈ పార్టీ ద్వారా ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం కొనసాగుతుందని తెలిపారు.రేపు జరగనున్న పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గం నుంచి యువకులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొనాలని కొట్టాల యాదగిరి పిలుపునిచ్చారు. తెలంగాణ ఆశయాలు నెరవేరాలంటే ప్రజలందరూ ఐక్యంగా నిలబడి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు.





