నేటి సాక్షి, ధర్మారం : ధర్మారం మండల కేంద్రంలోని ఆదర్శ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రవేశాలు ప్రారంభమైనట్లు మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. ధర్మారం మండలంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు తెలంగాణ మోడల్ స్కూల్స్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో లేదా నేరుగా కళాశాలను సందర్శించి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు సమయంలో పదవ తరగతి ఆన్లైన్ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్, నాలుగు పాస్పోర్ట్ సైజు ఫోటోలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఏసీఈ గ్రూపులలో ఒక్కో గ్రూపుకు 40 సీట్లు చొప్పున అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల పదవ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఇంటర్ రాష్ట్రస్థాయి ఫలితాల్లో మెరుగైన ప్రతిభ సాధించడంతో పాటు పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడానికి జూన్ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని కళాశాలలో అడ్మిషన్ల కొరకు విద్యార్థిని విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నిర్ణీత సమయంలో కళాశాలలో అడ్మిషన్ పొందాలని తెలిపారు. బాలికల కోసం ఉచిత హాస్టల్ సదుపాయం కూడా కల్పించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన సూచించారు.





