నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 12ఆదోని డివిజన్ అభివృద్ధి అధికారి బాలకృష్ణ రెడ్డి మంగళవారం పెద్దకడబూరు మండలాన్ని సందర్శించి గ్రామాలలో అమలవుతున్న స్వచ్ఛారథం, శానిటేషన్, జనగణన ఎన్యుమరేషన్ సర్వే, జలధార, జలహారతి కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. గ్రామ పరిశుభ్రత, చెత్త నిర్వహణ, తాగునీటి సదుపాయాలు మరియు ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా పెద్దకడబూరు గ్రామంలో నిర్వహిస్తున్న స్వచ్ఛారథం కార్యక్రమాన్ని పరిశీలించిన ఆయన, ప్రతి ఇంటి నుంచి పొడి చెత్త సేకరణ జరుగుతున్న తీరును పరిశీలించారు. ప్రజలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం 17 రకాల నిత్యావసర వస్తువులు అందజేస్తున్న విధానాన్ని కూడా సమీక్షించారు. గ్రామ ప్రజలు చెత్తను వేర్వేరుగా వర్గీకరించి అందించేలా అవగాహన కల్పించాలని సూచించారు.స్వచ్ఛారథం కార్యక్రమంలో భాగంగా గ్రీన్ అంబాసిడర్లు ఇంటింటికీ తిరుగుతూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్న తీరును అభినందించారు. గ్రామంలోని ప్రధాన రహదారులు, కాలువలు, చెత్త డంపింగ్ ప్రదేశాలు, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. SWPC షెడ్ పనితీరును కూడా పరిశీలించి చెత్తను శాస్త్రీయంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం పెద్దకడబూరు గ్రామ సచివాలయాన్ని సందర్శించిన బాలకృష్ణ రెడ్డి, జనగణన (Census Enumeration) సర్వే పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటింటి వివరాల సేకరణను ఖచ్చితంగా పూర్తి చేయాలని, ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. MPDO మరియు Dy.MPDOలకు స్వచ్ఛారథం కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, గ్రామాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అలాగే జలధార, జలహారతి పనుల పురోగతిని సమీక్షిస్తూ గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ సక్రమంగా ఉండేలా చూడాలని సూచించారు. నీటి వృథాను నివారించడంతో పాటు ప్రతి ఇంటికి తాగునీరు అందేలా అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని తెలిపారు.రేపు బుధవారం అనగా మే 13న నిర్వహించనున్న “స్వచ్ఛపథం” కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో విస్తృతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా గ్రామ ప్రధాన రహదారులపై పేరుకుపోయిన చెత్త కుప్పలు, పశువుల ఎరువు కుప్పలను పూర్తిగా తొలగించి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు.గ్రామ ప్రజలు కూడా పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, ఇంటి చెత్తను వేరు చేసి అందించాలని, గ్రామ పరిశుభ్రత పరిరక్షణలో ప్రతి ఒక్కరూ సహకరించాలని బాలకృష్ణ రెడ్డి కోరారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్లు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.





