నేటి సాక్షి గజ్వేల్:—-కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనవసరంగా విమర్శలు చేస్తూ విషం కక్కుతున్నారని, కోర్టు తీర్పుతోనైనా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి హితవు పలికారు. బుధవారం గజ్వేల్లో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత రెండున్నర సంవత్సరాలుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించడం తప్ప మరో పని చేయలేదని ఆయన ఆరోపించారు. కాలేశ్వరం అంశంలో కోర్టు తీర్పు కడిగిన ముత్యంలా కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు అనుకూలంగా వచ్చిందని తెలిపారు.కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై అవగాహన లేకుండా సీఎం మాట్లాడుతున్నారని, ఆయనతో పాటు మంత్రివర్గం కూడా అదే బాటలో ముందుకు సాగుతోందని ఎమ్మెల్సీ విమర్శించారు. మిగిలిన రెండు సంవత్సరాలైనా ప్రజా సంక్షేమం కోసం పని చేయాలని, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్పై విమర్శలు మానుకోవాలని సూచించారు.అలాగే ఢిల్లీ కాంగ్రెస్ ఇక్కడ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఉంచేది డబ్బు సంచులు పంపిస్తారని మాత్రమేనని, తెలంగాణ అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో కాదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం మానేసి ఇతరులపై దుమ్మెత్తిపోసే రాజకీయాలు చేయడం సరికాదని హెచ్చరించారు.





