నేటి సాక్షి, పేట మాధారం (సురేష్ మోత్కూర్): అతడు ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటాడనుకున్న ఆశ.. పచ్చని పొలానికి నీరు పోసి బంగారు పంట పండిస్తాడన్న నమ్మకం.. అంతా ఒక్క క్షణంలో బూడిదైపోయింది. నిత్యం రైతులకు అండగా ఉండాల్సిన వ్యవస్థలోని నిర్లక్ష్యం, ఒక నిండు ప్రాణాన్ని గాలిలో కలిపేసింది. పరిగి మండలం పేట మాధారం గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన, అధికారుల మొద్దునిద్రకు పరాకాష్టగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. మంచన్‌పల్లి కురువ అనంతయ్య కొడుకు మహేందర్ (24) అనే యువరైతు ప్రతిరోజూలాగే బుధవారం ఉదయం తన పొలానికి వెళ్లాడు. పంటకు నీరు పెట్టేందుకు బోర్ మోటార్ స్టార్ట్ చేయబోయాడు. అయితే, అప్పటికే అక్కడ పొంచి ఉన్న మృత్యువు విద్యుత్ షాక్ రూపంలో అతడిని కబళించింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన విద్యుత్ సరఫరా లోపంతో మహేందర్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. గ్రామస్థుల కథనం ప్రకారం.. ఈ కుటుంబానికి విద్యుత్ శాఖ శాపంగా మారింది. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే కుటుంబానికి చెందిన మరొక వ్యక్తి కూడా ఇలాగే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మరణించారు. దశాబ్దం గడిచినా అధికారుల తీరులో మార్పు రాకపోవడంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. “లైన్మెన్లకు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. రైతులకు తెలియకుండా ఇష్టానుసారంగా లైన్లు మార్చవద్దని కొత్త సర్పంచ్ ఆధ్వర్యంలో తీర్మానం చేసి ఇచ్చినా వారు పట్టించుకోలేదు” అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన లేకపోవడం, హెచ్చరికలను బేఖాతరు చేయడం వల్లే నేడు మహేందర్ ప్రాణాలు పోయాయని, ఒక కుటుంబం వీధిన పడిందని వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పరిగి పోలీసులు క్షేత్రస్థాయికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోహన్ కృష్ణ తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పేట మాధారం గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.





