నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 09 విద్యుత్ బిల్లుల వసూళ్ల పేరుతో ప్రజలను వేధిస్తున్న లైన్మెన్ రమేష్‌బాబుపై తక్షణ చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్దకడబూరు బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆందోళనలో రైతులు, సీపీఐ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని విద్యుత్ శాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, సీపీఐ మండల కార్యదర్శి వీరేష్, ఏఐకేఎస్ నాయకుడు ఆంజనేయ మాట్లాడుతూ.. గ్రామాల్లో కరెంట్ సమస్యలు వచ్చినప్పుడు ఫోన్ చేసినా స్పందించకుండా, బిల్లుల వసూళ్ల విషయంలో మాత్రం ప్రజల ఇళ్లకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. “బిల్లు కడతావా.. కరెంట్ కట్ చేయాలా” అంటూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.రాత్రివేళల్లో విద్యుత్ సమస్యలు వచ్చినప్పుడు ప్రజలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరైన స్పందన లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇటువంటి అధికారుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి రమేష్‌బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేదంటే రైతు సంఘం ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు





