-వేలాదిగా తరలివచ్చిన భక్తులు…
-దాసంగాలతో స్వామివారికి మొక్కులు..
-భక్తులకు అలంకరణలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం..
నేటి సాక్షి, దేవరకద్ర జులై 6
మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆదివారం జనసంద్రమైంది. తొలి ఏకాదశి పర్వదిన వేడుకలను పురస్కరించుకొని జిల్లా నుండే గాక ఇతర జిల్లాల నుండి భక్తులు స్వామి దర్శనానికి వేలాదిగా మన్యంకొండ దేవస్థానానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ముందుగా భక్తులు దేవస్థానం ముందున్న కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే కొంతమంది భక్తులు స్వామి వారికి ప్రీతిపాత్రమైన దాసంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మరి కొంతమంది తలనీలాలు సమర్పించారు. ఉదయం 7 నుండే స్వామి దర్శనానికి భక్తులు దేవస్థానం వద్ద బారులు తీరారు. దీంతో మన్యం కొండలు భక్త జన సందోహంతో పులకించిపోయాయి. దేవస్థానం పరిసరాలలో ఎక్కడ చూసినా భక్తులే కనిపించారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు ఘాట్ రోడ్డు గుండా మూడు కిలోమీటర్ల మేర కాలినడకన స్వామి దర్శనానికి తరలిరాగా… మరి కొంతమంది భక్తులు వివిధ వాహనాలలో గుట్ట పైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు తదితర పూజలు నిర్వహించారు. అలాగే దేవస్థానం అనుబంధ దేవాలయమైన శివాలయంలో కూడా భక్తులు వివిధ పూజలు నిర్వహించారు. అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. దేవస్థానం దిగకుండా వద్దనున్న శ్రీ అలివేలు మంగతాయారు దేవస్థానం వద్ద కూడా భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. అభిషేకాలు, అర్చనలతో పాటు సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అలాగే దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో కూడా భక్తులు వివిధ పూజలు నిర్వహించారు. విశేష దినోత్సవం పురస్కరించుకొని భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దేవస్థానం వద్ద సంబందించిన అధికారులు ఏర్పాటు చేశారు. స్వామివారిని రకరకాల పూలు, వివిధ బంగారు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా స్వామివారు అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారికి జరిగిన పూజా కార్యక్రమాలలో దేవస్థానం చైర్మన్, వంశపారంపర్య ధర్మకర్త అళహరి మధుసూదన్ కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, ప్రధాన పూజారులు రాజేష్, నరసింహయ్య పాలకమండలి సభ్యులు, పర్యవేక్షకుడు నిత్యానంద చారి లతో పాటు దేవస్థానం సిబ్బంది, వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు పాల్గొన్నారు.