నేటి సాక్షి మహబూబాబా ద్ (భూక్యా రవి నాయక్) జనవరి 23నరసింహులపేట మండల పరిధిలో నల్ల బెల్లం, గంజాయి అక్రమ రవాణా, వరుస దొంగతనాలపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అక్రమాలకు ప్రధాన కారణం గ్రామాల్లో సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయకపోవడమేనని స్థానికులు చర్చించుకుంటున్నారు. భద్రత కోసం ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థ నిర్వీర్యంగా మారడంతో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.పెద్దనాగారం స్టేజ్ సమీపంలో సుమారు ఏడాది క్రితం జరిగిన ద్విచక్ర వాహన దొంగతనం ఘటన ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం దీనికి నిదర్శనమని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ ఘటన సమయంలో సీసీ కెమెరాలు పనిచేసి ఉంటే దొంగతనానికి సంబంధించిన కీలక సమాచారం లభించేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం దొరకలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మండలంలోని పలు గ్రామాల్లో ప్రధాన కూడళ్లలో, స్టేజ్‌ల సమీపంలో, రహదారుల వెంట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి నిర్వీర్యంగా ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. నిఘా లేకపోవడం వల్లే నల్ల బెల్లం, గంజాయి తరలింపులు, చిన్నచిన్న దొంగతనాలు నిర్భయంగా జరుగుతున్నాయన్న చర్చ సాగుతోంది.ప్రజల భద్రతకు సీసీ కెమెరాలే ప్రధాన రక్షణగా మారాయని, అవి సక్రమంగా పనిచేస్తే దొంగతనాలు, అక్రమ కార్యకలాపాలు గణనీయంగా తగ్గుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే మండల వ్యాప్తంగా పనిచేయని సీసీ కెమెరాలను తక్షణమే మరమ్మతులు చేసి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు.





