నేటి సాక్షి వికారాబాద్ :వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఆదేశాల మేరకు, మునిసిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో,స్వేచ్ఛాయుతంగా,నిష్పక్షపాతంగా నిర్వహించాలనే లక్ష్యంతో వికారాబాద్ పట్టణంలో వికారాబాద్ సబ్ డివిజన్ పోలీసులు భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, సమస్యాత్మక ప్రాంతాలు, జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల మీదుగా ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది.ఈ సందర్భంగా డీఎస్పీ ఎన్. శ్రీనివాస్ రెడ్డి, టౌన్ ఇన్స్పెక్టర్ కే. రఘు కుమార్ మాట్లాడుతూ, ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేసినా, అసాంఘిక శక్తులు తలదూర్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడు 24/7 అందుబాటులో ఉంటుందని, ప్రజల రక్షణే తమ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు విజయవంతం అయ్యేలా సహకరించాలని ప్రజలకు తెలియజేయడం జరిగింది.ఈ ఫ్లాగ్ మార్చ్‌లో వికారాబాద్ డీఎస్పీ ఎన్. శ్రీనివాస్ రెడ్డి, టౌన్ ఇన్స్పెక్టర్ కే. రఘు కుమార్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది, ఏఆర్ పోలీస్ అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.





