నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 04 కోసిగి పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల నుండి కొన్ని పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేయడం నిలిపివేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) డిమాండ్ చేసింది. జిల్లా ఉపాధ్యక్షుడు యస్. ఈరేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మూడు సబ్జెక్టులకు ₹110, అంతకంటే ఎక్కువకు ₹125 ఉన్నప్పటికీ, కోసిగి గర్ల్స్ హై స్కూల్‌లో ఒక్కో విద్యార్థి వద్ద ₹150, వందగల్ హై స్కూల్‌లో ₹300 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.పరీక్షల్లో విఫలమైన బాధలో ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులను ఫీజుల పేరుతో వేధించడం అమానుషమని ఆయన పేర్కొన్నారు. అధిక వసూళ్లపై విద్యాశాఖ అధికారులు తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా వసూలు చేసిన డబ్బును వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు.డిమాండ్లు అమలు చేయకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థులు అస్లాం, ఆకాష్, వీరారెడ్డి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.





