నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )మున్సిపల్ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని అధికారులకు ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు.*ఉమ్మడి కరీంనగర్ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష*మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపెల్లి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్ల పురోగతిని అడిగి తెలుసుకుని, పలు కీలక సూచనలు చేశారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జగిత్యాల కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి బి. సత్యప్రసాద్‌తో పాటు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌కు వివరించారు.*పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై స్పష్టమైన ఆదేశాలు*ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని మాట్లాడుతూ… పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు సమృద్ధిగా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. పోలింగ్ బృందాలు, డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ కేంద్రాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.కౌంటింగ్ కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అన్ని భద్రతా ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని, కౌంటింగ్ పూర్తైన అనంతరం మున్సిపాలిటీలలో చైర్‌పర్సన్, కార్పొరేషన్లలో మేయర్ ఎన్నిక కోసం ఫారం–2లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు ఈ విషయమై ముందుగానే సమాచారం అందించాలని తెలిపారు.*ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం : జగిత్యాల జిల్లా కలెక్టర్*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ… జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఎన్నికలు, పోలింగ్, కౌంటింగ్‌కు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. ఇందుకోసం స్పెషల్ ఆఫీసర్లు, నోడల్ అధికారులు, అవసరమైన సిబ్బందిని నియమించామని చెప్పారు. రెండవ రాండమైజేషన్ కూడా పూర్తిచేశామని తెలిపారు.ఐదు మున్సిపాలిటీల్లో జరగనున్న ఎన్నికలకు అవసరమైన పోలింగ్, కౌంటింగ్ సిబ్బందిని నియమించి, వారికి పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించాల్సిన విధులపై తగిన శిక్షణ అందించామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు జిల్లా పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.*పకడ్బందీగా పోలీస్ బందోబస్తు : జగిత్యాల జిల్లా ఎస్పీ*జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ… జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో జరగనున్న ఎన్నికలు, పోలింగ్ సందర్భంగా పకడ్బందీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో తగిన స్థాయిలో పోలీస్ బలగాలను మోహరిస్తున్నట్లు వెల్లడించారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు మధుసూదన్, జీవాకర్ రెడ్డి, శ్రీనివాస్, జెడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి, నోడల్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు._____





