Saturday, March 7, 2026

*ధనబలం వర్సెస్ దశాబ్దాల నమ్మకం*————————* ఎన్నికల వేళ మెట్‌పల్లిలో మారుతున్న సమీకరణాలు!* టికెట్ల రాజకీయాలు.. కేడర్ ఆగ్రహం.. * బలపడుతున్న స్వతంత్రులు -ప్రజాతీర్పు ఎటు?—*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )మున్సిపల్ ఎన్నికల వేళ మెట్‌పల్లి, కోరుట్ల పట్టణాలు రాజకీయంగా మరిగిపోతున్నాయి. టికెట్ల కేటాయింపులో పార్టీలు అనుసరిస్తున్న విధానం, క్షేత్రస్థాయి కార్యకర్తల భావోద్వేగాలను గాయపరుస్తుండటంతో అంతర్గత అసంతృప్తి, రెబల్ రాజకీయాలు, స్వతంత్ర అభ్యర్థుల ఉత్థానం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలు ఈ ఎన్నికలను సాధారణ స్థానిక సంస్థల పోటీగా కాకుండా, పార్టీల భవిష్యత్తుకు పరీక్షగా మార్చుతున్నాయి.*టికెట్ అంటే గెలుపు ఫార్ములానా.. లేక గౌరవమా?*రాజకీయాల్లో టికెట్ కేటాయింపు అనేది కేవలం గెలుపు–ఓటముల గణాంకాలకు సంబంధించిన వ్యవహారం కాదు. ఏళ్ల తరబడి పార్టీ కోసం పని చేసిన కార్యకర్తల ఆత్మగౌరవం, ఆశలు, నమ్మకాలు దీనితో ముడిపడి ఉంటాయి.మెట్‌పల్లి, కోరుట్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులు ఈ వాస్తవాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన విధేయులను పక్కన పెట్టి, ‘ధనబలం’, ‘గెలిచే గుర్రాలు’ అనే కారణాలతో బయటి నుంచి వచ్చిన పారాచూట్ నాయకులకు టికెట్లు ఇవ్వడం ఇప్పుడు పెను రాజకీయ విస్ఫోటనానికి కారణమైంది. ఇదే అసంతృప్తి రెబల్ అభ్యర్థిత్వాలుగా, స్వతంత్ర పోటీగా బయటపడుతోంది.*క్షేత్రస్థాయిలో పార్టీల పని తీరు – స్పష్టమైన తేడా*ప్రస్తుత ప్రచార సరళిని గమనిస్తే, ప్రధాన పార్టీల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది.బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే, జిల్లా అధ్యక్షులు స్వయంగా రంగంలోకి దిగుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా అభ్యర్థులకు అండగా నిలుస్తూ, కేడర్‌లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కార్యకర్తలకు ‘పార్టీ మనతో ఉంది’ అన్న భావనను కల్పిస్తోంది.*కాంగ్రెస్‌లో ప్రచార హడావుడి.. క్షేత్రంలో ఖాళీ.!*కాంగ్రెస్ పార్టీ ప్రచారం మాత్రం భిన్నంగా సాగుతోంది. ప్రచార రథాలు, సభలు ఉన్నప్పటికీ, ఓటర్లతో నేరుగా మమేకమయ్యే ప్రయత్నం తక్కువగా కనిపిస్తోంది.నాయకులు వచ్చి చేయి ఊపి వెళ్లడం తప్ప, ఇంటింటి స్థాయిలో అనుబంధం ఏర్పరచుకోలేకపోతున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అసంతృప్తి కేడర్‌లో నెమ్మదిగా విస్తరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.*బీజేపీ క్షేత్ర స్థాయి ఉనికే ప్రశ్నార్థకం.!*మెట్‌పల్లి పట్టణంలో బీజేపీ విషయానికి వస్తే, పార్టీ నాయకుల కదలికలు, ప్రచార జోరు స్పష్టంగా కనిపించకపోవడం వారి ప్రధాన బలహీనతగా మారింది. పట్టణ రాజకీయాల్లో పార్టీ ఉనికిని బలంగా చాటే కార్యక్రమాలు లేకపోవడంతో, పోటీలో వెనుకబడుతున్నారన్న భావన ఏర్పడింది.*డబ్బుతో టికెట్.. నమ్మకంతో ఓటు.!*టికెట్‌ను డబ్బుతో సాధించవచ్చేమో కానీ, ఓటర్ల గుండెల్లో స్థానం సంపాదించాలంటే కష్టకాలంలో పక్కన నిలవాలి అన్న భావన మెట్‌పల్లిలో బలంగా వినిపిస్తోంది.విపత్తుల్లో, సమస్యల్లో, వ్యక్తిగత కష్టసుఖాల్లో తోడుగా ఉన్న నాయకుడినే ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. ఇదే కారణంగా స్థానికంగా బలమైన వ్యక్తిగత ఇమేజ్ ఉన్న స్వతంత్ర అభ్యర్థుల వైపు ఓటర్లు ఆకర్షితులవుతున్నారు.*రెబల్స్ కాదు.. ప్రత్యామ్నాయ నాయకత్వం*ప్రారంభంలో స్వతంత్ర అభ్యర్థులను కేవలం ఓట్లు చీల్చే ‘గేమ్ ఛేంజర్లు’గా భావించారు. కానీ తాజా ప్రచార సరళి చూస్తే, వారు ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారు.ప్రత్యేకంగా పార్టీ టికెట్ రాకపోవడంతో అసంతృప్తికి గురైన అనుభవజ్ఞులైన కార్యకర్తలు స్వతంత్రంగా బరిలో నిలవడం, వారిపై ప్రజల్లో సానుకూల స్పందన కనిపించడం గమనార్హం.*మెట్‌పల్లి ఫలితాలు పార్టీలకు హెచ్చరిక*కిందిస్థాయి కార్యకర్తలను విస్మరిస్తే పార్టీ పునాదులే కదిలిపోతాయన్న వాస్తవాన్ని మెట్‌పల్లి రాజకీయాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక మున్సిపాలిటీ వరకే కాకుండా, మిగిలిన పట్టణాలు, నియోజకవర్గాలకు కూడా హెచ్చరికగా మారే అవకాశముంది.*ప్రజాతీర్పు ఏ వైపు.?*చివరికి ఓటరు తీర్పుధనబలం వైపా? లేదా దశాబ్దాల నమ్మకం, సేవ, అనుబంధం వైపా?అన్న ప్రశ్నకు సమాధానం త్వరలో వెలువడనుంది.మెట్‌పల్లి మాత్రం ఈ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలకు ఒక బలమైన సంకేతం ఇవ్వబోతున్నది.—

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News