నేటి సాక్షి,నారాయణపేట, మే 2 (రిపోర్టర్ ఇమామ్ సాబ్),నారాయణపేట: జిల్లా ప్రజలు ప్రస్తుతం తీవ్ర ఎండల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.ఇటీవల అధిక ఎండల కారణంగా ఒక ద్విచక్ర వాహనం అగ్నికి ఆహుతి అయిన సంఘటనను ప్రస్తావిస్తూ, వాహనాలను నేరుగా ఎండలో పార్క్ చేయకుండా చెట్ల నీడలో లేదా షెడ్లలో ఉంచాలని సూచించారు. వాహనాల్లో ఇంధనం, బ్యాటరీలు వంటి భాగాలు అధిక వేడికి గురై ప్రమాదాలకు దారితీయవచ్చని హెచ్చరించారు.ప్రజలు ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. బయటకు వెళ్లాల్సి వస్తే తలకు గుడ్డ లేదా టోపీ ధరించడం, చల్లని నీరు తరచుగా తాగడం, ఎలక్ట్రోలైట్ పానీయాలు సేవించడం ద్వారా డీహైడ్రేషన్ నుంచి రక్షించుకోవాలని సూచించారు.వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు మరియు అనారోగ్యంతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎండల వల్ల అలసట, తలనొప్పి, తల తిరగడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు.ఎండల్లో ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహించే పోలీసులు, చెక్‌పోస్ట్‌లలో విధులు నిర్వర్తించే సిబ్బంది మరియు ఇతర ఫీల్డ్ డ్యూటీలో ఉన్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. వీరు తరచుగా నీరు తాగుతూ, అవసరమైతే నీడలో విశ్రాంతి తీసుకుంటూ, తలకు క్యాప్ లు, గుడ్డలు ఉపయోగించడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు.అదేవిధంగా, గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో, చెత్త గుట్టల వద్ద అజాగ్రత్తగా మంటలు వేయకుండా ఉండాలని సూచించారు.ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే పోలీసులకు లేదా డయల్ 100 కి సమాచారం అందించాలని, ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.





