నేటి సాక్షి, ఎండపల్లి:* మండలంలోని గుల్లకోట రైతు వేదికలో శనివారం నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం రైతులకు శాస్త్రీయ సాగుపై మార్గదర్శకంగా నిలిచింది. పంటల ఉత్పాదకత పెంపు, నేల ఆరోగ్య పరిరక్షణ, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడుల సాధన లక్ష్యంగా శాస్త్రవేత్తలు రైతులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా పొలాస పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి.స్పందన బట్ మాట్లాడుతూ.. అధిక యూరియా వినియోగాన్ని తగ్గించి సమతుల్య ఎరువుల వాడకాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పంటల మార్పిడి, ప్రకృతి వ్యవసాయం, పచ్చిరొట్ట పంటల సాగు, నేల సారవంతత పెంపు, సాగునీటి సమర్థ యాజమాన్యం, మార్కెట్లో గిరాకీ ఉన్న సన్న వరి రకాల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్త ఎన్.సుమలత వివిధ పంటల్లో చీడపీడల నివారణకు సమగ్ర చర్యలు, రసాయన మందుల సక్రమ వినియోగం, వరి కోత అనంతరం పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలియదున్నడం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. హెచ్ఈఓ వంశీకృష్ణ ఉద్యాన పంటలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, పసుపు సాగు, పండ్ల తోటల అభివృద్ధి అవకాశాలపై రైతులకు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కె.మహేష్, వ్యవసాయ విస్తరణాధికారి ఎస్.లావణ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు టి.శైలేందర్ రెడ్డి, గుల్లకోట సర్పంచ్ గొల్లపల్లి మల్లేష్ గౌడ్, నాయకులు పడిదం మొగిలి, అరిగేలా రవి, మెరుగు శ్రీనివాస్, ఇరుకుల్ల విక్రమ్, జల్లెల్ల కనుకయ్య, గోనె సంతోష్, బంగారయ్య, మల్లారెడ్డి, వివిధ గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు.





